పొంగులేటి సహస్ర చండీ యాగం
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఆయన సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన సహస్ర చండీయాగం చేస్తున్నారు. పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి రుత్వికుల సమక్షంలో.. యాగం చేస్తున్నారు. లోక కల్యాణం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 13న ప్రారంభమైన ఈ యాగం అక్టోబర్ 17న ముగియనుంది. ఆదివారం మొదలైన ఈ సహస్ర చండీ యాగం నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాగానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. 9 మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్న ఈ యాగానికి చినజీయర్ స్వామి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, ధర్మపురి సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి తదితరులు హాజరై ప్రవచనాలు వినిపిస్తారని తెలుస్తుంది. సహస్ర చండీయాగంలో మహిళలకు సామూహిక కుంకుమార్చనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చండీయాగానికి హాజరయ్యే భక్తుల కోసం అన్నదానం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం, గతంలో పొంగులేటి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలుపొందడంతో.. తెలంగాణతోపాటు ఆంధ్రాకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయాల్లో దూకుడు తగ్గిన పొంగులేటి ఇప్పుడు కేసీఆర్ తరహాలో చండీ యాగానికి శ్రీకారం చుట్టడం గమనార్హం