తిరుపతి నుంచి బిజెపి పోటీ చేయడం లేదా…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిడిపిని కాదని ఎదగడానికి బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే, టిడిపి స్థానంలో బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బిజెపికి షాక్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితిని పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టంచేసాయి. బిజెపి మద్దతు ఉన్న అభ్యర్థులు కొన్ని సీట్లు గెలుచుకోగలిగారు.ఇందు కు జనసేన మద్దతు కూడా ఉండటం గమనార్హం.
- Advertisement -
బిజెపి ఎక్కువ భాగం గెలుచుకున్న సీట్లలో కాపు సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి.తిరుపతి ఉప ఎన్నికలో బిజెపికి సీటు ఇవ్వాలా? లేక జనసేనకు ఇవ్వాలా? ఆ సందేహానికి పంచాయతీ ఎన్నికలు స్పష్టమైన సందేశం ఇచ్చాయి. జనసేనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలన్న బలమైన వాదనకు పంచాయతీ ఎన్నికలు బలం చేకూర్చాయి. పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పనితీరు చూసిన తరువాత, జనసేనకు తిరుపతి ఎంపి సీటు ఇవ్వడం సరైనదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. “బిజెపి, జనసేన తిరుపతి ఉప ఎన్నికలో ఇద్దరికీ గెలిచే అవకాశం లేదు. జనసేన ఓట్లు బదిలీ చేయకపోతే, బిజెపి కూడా డిపాజిట్ కోల్పోవచ్చు. జనసేనకు సీటు ఇవ్వకపోతే నోటాకు ఓటు వేయాలని స్థానిక బలిజ అసోసియేషన్ ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి జనసేనకు సీటు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం ”అని బిజెపి లోని ఒక వర్గం చెబుతోంది. వైసిపి సిట్టింగ్ ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ రావు మరణించి ఐదు నెలలకు పైగా అయింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాలి. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుందని అంటున్నారు.