అజ్ఞాతవాసంలో దేశం మాజీ మంత్రులు..!
మంత్రి పదవిలో ఉంటేనే మేము మనుషులం.. మంత్రి పదవులతో అధికారం శాసించగలిగితేనే కనిపిస్తాం.. మంత్రి పదవి కోల్పోతే మేము మా వ్యాపారాలకే పరిమితం అవుతాం.. అన్న చందంగా మాజీ మంత్రులిద్దరూ ఐదేళ్ల పాటు మంత్రి పదవి నిర్వహించి రాజకీయ, అధికార, ఆర్దిక లబ్ది పొంది సొంత వ్యాపారాలను బాగా అభివృద్ది చేసుకున్నారు.
ఎప్పుడైతే చంద్రబాబు అధికారం కోల్పోయారో.. ఆ మాజీ మంత్రులలో ఒకరు అజ్ఞాత వాసానికి వెళ్లారు. మరొకరు హైదరాబాదులో ఎక్కువగా ఉంటున్నారట. మిమ్ములను నమ్మి చంద్రబాబు మంత్రి పదవులిచ్చారు. ఐదేళ్ల పాటు ఆ పదవులతో అన్ని విధాలుగా లబ్ది పొందారు. ఆయన అధికారం కోల్పోయాక దగ్గరుండి ధైర్యం చెప్పాల్సిన మీరు స్వార్దంతో వ్యవహరించటం ఎంత వరకు సబబు అని ఎవరైనా ప్రశ్నించి నిలదీస్తే.. ఒక మంత్రి మౌనం వహిస్తారు.
- Advertisement -
మరో మంత్రి కుటుంబ సభ్యులు రెచ్చి పోయి మాకు మంత్రి పదవి ఊరికే ఇచ్చారా.. అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. ఇలాంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మి మంత్రి పదవులిచ్చిన చంద్రబాబుది తప్పా.. తమను గుడ్డిగా నమ్మి చంద్రబాబు మంత్రి పదవులిచ్చారు. అధికారం కోల్పోయాక చంద్రబాబుకు అండగా ఉండాలి అని ఆ మాజీ మంత్రులు భావించకపోవటంలో మర్మం ఏమిటి..?
మాజీ మంత్రులలో ఒకరు నారాయణ. ఐదేళ్లపాటు అధికారం చెలాయించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ భూ స్థాపితం కావటానికి ఎంత మంది కారకులు అనే విషయం పక్కన పెడితే.. మాజీ మంత్రి నారాయణ కూడా కారకులు అనే విషయాన్ని టిడిపి కార్యకర్తలే చెబుతుంటారు. మరొకరు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఆయనే అని తెలిసినా.. ఐదేళ్ల పాటు ఆయనను మంత్రి పదవిలో కొనసాగించారు చంద్రబాబు.
మాజీ మంత్రి నారాయణ అజ్ఞాతంలో ఉన్నట్లుగా టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు. అడపా దడపా నెల్లూరు నగరానికి వచ్చి ఎవరికీ కనిపించకుండా తిరిగి వెళుతున్నారట. మాజీ మంత్రి పుల్లారావు అప్పుడప్పుడు గుంటూరు వచ్చి మొక్కుబడిగా 10మందికి కనిపించి మీడియా సమావేశం కూడా నిర్వహించి మళ్లీ హైదరాబాదు వెళుతున్నారు. అటు మాజీ మంత్రి నారాయణను, ఇటు మాజీ మంత్రి పుల్లారావును గుడ్డిగా నమ్మి పదవులిచ్చిన చంద్రబాబును వదిలేసి వారిద్దరు వ్యాపారాలు చూసుకుంటున్నారని.. వారిద్దరు ఎంత స్వార్దపరులో.. అవకాశవాదులో అనుభవంతో కాని తెలిసి రాలేదని టిడిపి ముఖ్యనేతలు అంటున్నారు.