స్వామి సేవలో తరిస్తున్న ఐఎఎస్, ఐపిఎస్‌లు..!
దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మగా పేరున్న కెవిపి.రామచంద్రారావును అప్పట్లో పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు తప్పనిసరిగా కలిసేవారు. అప్పట్లో వారు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన కెవిపి కార్యాలయం ముందు వేచి ఉన్న దృశ్యాలు కనిపించేవి. బదిలీలు, పోస్టింగ్‌లు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కలిస్తే.. ఒకసారి కెవిపిని కూడా కలవండి అని అప్పట్లో ఆయన ఐఎఎస్, ఐపిఎస్‌లకు సూచించేవారు.
దివంగత వైఎస్సార్ మరణంతో.. అప్పటి వరకు కెవిపిని కలిసిన అధికారులు.. మళ్లీ ఆయనను కలవలేదు. ఇదంతా గతం.. తాజాగా.. సిఎంజగన్ రెడ్డి విశాఖ స్వామీజి మాట వింటారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయనను కలిసేందుకు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పోటీ పడుతున్నారట. ఇప్పటి వరకు ఎంతమంది స్వామీజిని కలిశారు అనే విషయం బయట పడకపోయినా.. చాలా మంది కలిశారని.. తమ పేరు బయట పెట్టవద్దని స్వామీజి శిష్యులకు చెబుతున్నారట.
స్వామి గారి ఆశీస్సులుంటే కీలక ప్రాధాన్యత పోస్టులు దక్కించుకోవచ్చు అని విశాఖ స్వరూపానంద స్వామి శిష్యులు ప్రచారం చేస్తున్నారట. తమకు తెలిసిన వారితో ఫోనులో మాట్లాడుతూ మీరు విశాఖ రండి.. స్వామీజిని కలవండి.. ఆయన ఆశీర్వదిస్తారు.. మీకు కావాల్సినది కోరుకోండి..ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్పి చేయిస్తారని వారు అంటున్నారట.
- Advertisement -
ఇందులో నిజా నిజాలు ఎంత వరకు ఉన్నాయో కానీ విశాఖ స్వామి తలుచుకుంటే ఏ పనులు అయినా అయిపోతాయని.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వామీజి చెప్పినట్లు వింటున్నారని కూడా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు నమ్ముతున్నారు. ఇటీవల మాజీ డిజిపి ఏపీఎస్ ఆర్టీసి ఎండీ ఆర్పి.ఠాగూర్ స్వామిజీని కలిసినట్లు సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రచారం అయింది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఆర్పి.ఠాగూర్‌ను డిజిపి పదవి నుండి సిఎం జగన్ రెడ్డి తప్పించిన విషయం విధితమే. ఇటీవలె ఆయనను ఆర్టీసి ఎండీగా నియమించటం వెనుక.. కేంద్ర బిజెపి పెద్దల ప్రభావం పనిచేసిందని ప్రచారం జరిగినప్పటికీ.. విశాఖ స్వామిజి ఆశీస్సులే పనిచేశాయని.. ఐపిఎస్ అధికారులు చెప్పుకుంటున్నారు.
కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు విశాఖ స్వామీజిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నా.. ఎక్కడా తమ ఫొటోలు బయట పడకుండా జాగ్రత్త పడ్డారట. కీలక ప్రాధాన్యత పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ఐఎఎస్, ఐపిఎస్ అధికారులలో కొంతమంది ఏదో విధంగా విశాఖ స్వామీజిని రహస్యంగా కలిసేందుకు ఆయన శిష్యులను మచ్చిక చేసుకుంటున్నారట.
ఇంతకీ విశాఖ స్వామిజీ ఎవరెవరికి ఏయే పోస్టులను ఇప్పించారనే విషయం బయట పడకపోయినా.. ఒకరిద్దరికి ప్రాధాన్యత పోస్టులు ఇప్పించారని ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి మరో రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయం. ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత పోస్టులు కావాలనుకునేవారు విశాఖ స్వామీజిని తప్పనిసరిగా కలిసేందుకు నిర్ణయించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.