Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అత్తగారి రాజ్యంలో కొంపముంచిన అల్లుడు పెత్తనం..?

రాజకీయ నాయకులకు వారసులుగా కుమారులు, కుమార్తెలు రంగ ప్రవేశం చేస్తున్న నేపధ్యంలో తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకు స్వయాన అల్లుడు రాజకీయంగా తెరపైకి వచ్చి నాడు అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేశారు. ఆ తరువాత ఆమె ఓటమికి అల్లుడుగారే కారణం అయ్యారు. తాజాగా మునిసిపల్‍ ఎన్నికలలో అధికార ఏకగ్రీవాలకు కూడా అల్లుడే కారణమని.. అత్త మాజీ ఎమ్మెల్యేకు తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది.

తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే అత్తగారి మెతకతనంతో అల్లుడు గారి దూకుడు తనం పెరిగి పార్టీ ప్రతిష్టను మంటగలిపిందంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఎక్కువ నియోజకవర్గాలలో కుమారులు, కుమార్తెలు పెత్తనం చేస్తుంటే.. మా నియోజకవర్గం అయిన తిరుపతిలో అత్తగారి తరపున అల్లుడు పెత్తనం చేసి పార్టీని భూస్థాపితం చేశారని పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అధికార పార్టీ నేతలతో, అమాత్యులతో పరోక్ష సంబందాలు పెట్టుకున్న అల్లుడుగారి తీరుతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పరపతికి దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తిరుపతి మునిసిపల్‍ ఎన్నికలలో అధికార పార్టీ ఏకగ్రీవాలకు టిడిపి మాజీ ఎమ్మెల్యేకు స్వయాన అల్లుడు తెర వెనుకుండి సహకరించారని అభ్యర్ధులుగా నామినేషన్‍ వేసేందుకు ముందుకు వచ్చిన తెలుగుతమ్ముళ్లను అల్లుడు గారు వారించారని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తిరుపతి నియోజకవర్గం బలహీన పడటానికి మాజీ ఎమ్మెల్యే సుగుణ అల్లుడే ముఖ్యకారణమని పార్టీ నేతలు అంటున్నారు. అత్తగారి రాజ్యంలో అల్లుడి పెత్తనం వలన పార్టీ బాగా దెబ్బతిందని.. స్థానిక కార్యకర్తలు తెర వెనుక చెబుతున్నారు. 2019 ఎన్నికలలో జగన్‍ గాలి బలంగా వీచినా తిరుపతి టిడిపి అభ్యర్ధి సుగుణ కేవలం 800ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

ఆనాడు అత్త సుగుణ ఓటమికి, ఈనాడు అధికార పార్టీ ఏకగ్రీవాలకు ముఖ్యకారణం అల్లుడే అని స్థానిక నేతలు అంటున్నారు. ఏదిఏమైనా తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుగుణ శకం ముగిసినట్లే అని అందుకు కారణం అల్లుడు పెత్తనమే అని గ్రహించిన చంద్రబాబు వారి సామాజికవర్గానికి చెందిన నేతను తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలున్నాయని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.