విజయవాడ పార్టీకి నేనే అధిష్టానం అంటున్న కేశినేని..!
విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల మధ్య ఆదిపత్య పోరు ప్రారంభం అయింది. మిగతా వారి కన్నా నేను చాలా గొప్పవాడినన్న భావన విజయవాడ ఎంపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కూడా అదే మాటలను వినిపిస్తున్నారు. ఈ విషయం అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లటంతో ఆయన నలుగురు నాయకులతో విడి విడిగా మాట్లాడాలనుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
టిడిపిలో వర్గాలు లేవు, ఉన్నది ఒకే ఒక్క వర్గం.. అది చంద్రబాబు వర్గమే అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. చిన్న చిన్న వివాదాలున్నా వాటిని చంద్రబాబు పరిష్కరిస్తారని ఉమా తెలిపారు. వ్యక్తుల కన్నా పార్టీయే మిన్న అని మా నాయకులందరికీ తెలుసు. క్షణికమైన ఆవేశంతో కానీ.. అప్పుడప్పుడు నోరు జారీ కానీ మా నాయకులు మాట్లాడవచ్చు. ఆ తరువాత తాము మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకున్న సంఘటనలు జరిగాయి.
- Advertisement -
లేని విభేదాలు ఉన్నట్లుగా పలు టివి ఛానెళ్లు పదే పదే ప్రచారం చేస్తున్నాయి. ఒక ప్రతిక ఆవాస్తవాలతో కధనాలు ప్రచురిస్తుందంటున్నారు విజయవాడ టిడిపి నాయకులు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధిష్టానం.. విజయవాడ టిడిపికి నేను అధిష్టానం అన్న రీతిలో ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్నారని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు టిడిపి నేతలు. మునిసిపల్ కార్పోరేటర్ల ఎంపికలో ఎక్కడెక్కడ విభేదాలుంటే వాటిని చంద్రబాబు సరిదిద్దుతారని అంత వరకు ఎవరూ బాహాటంగా బయట పడవద్దని తుది నిర్ణయం చంద్రబాబే తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే ఉమాతో పాటు టిడిపి ముఖ్యులు తమను కలిసిన కార్యకర్తలతో చెబుతున్నారు.
విజయవాడ టిడిపి నాయకుల మధ్య ఐక్యత కరువు అయిందని విమర్శలు వస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలకు నడుమ దూరం పెరుగుతూ వస్తుంది.. వీరందరినీ సమన్వయ పరిచి ఏకతాటిపై తీసుకు వచ్చే విదంగా అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు సఫలీ కృతం కాకపోవటంతో రేపో మాపో పార్టీ నేత చంద్రబాబునాయుడే రంగంలోకి దిగుతున్నట్లుగా పార్టీ నేతలు అంటున్నారు.