అప్పులతో తిప్పలు తప్పవంటున్న ఆర్దిక మంత్రి..!
ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించిన బుగ్గన.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును శాసనసభలో తీవ్రంగా దుయ్యబట్టేవారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారు.
పబ్లిక్ ఎకౌంట్ కమిటీ ఛైర్మన్ హోదాలో ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న అవతవకలను బయటకు తీసి ఎండగట్టారు. రాజకీయంగా కొన్ని నైతిక విలువలు బుగ్గనలో కనిపిస్తున్నాయంటారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా గతం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్దిక మంత్రిగా బుగ్గన నియమితులయ్యారు. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన మంత్రి బుగ్గన ఆ తరువాత మెల్లమెల్లగా దూకుడు తగ్గించుకున్నారు. ఎక్కువ సమయాన్ని మౌనంతో గడిపారు.
- Advertisement -
సిఎం జగన్ రెడ్డి తీరును తప్పుపట్టలేక ఆర్దిక పరిస్థితిని మెరుగుపరచలేక ఈ మంత్రి పదవి నాకు ఒద్దు బాబోయ్ అంటూ బుగ్గన తల పట్టుకుంటున్నారట. ఒక సమయంలో ఆర్దిక శాఖను మార్చి మరో శాఖను అయినా కేటాయించండి… లేదా మంత్రి పదవి నుండి అయినా తప్పించండి అని మంత్రి బుగ్గన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలిసి స్వయంగా కోరాలనుకున్నారట. కానీ కొంతమంది సన్నిహితులతో పాటు కొంత మంది అధికారుల సలహాతో ఆప్రతిపాదనను బుగ్గన విరమించుకున్నారట.
కొన్ని నెలల పాటు మౌనం వహించిన ఆర్దిక మంత్రి బుగ్గన మొన్న మళ్లీ తెరపైకి వచ్చి ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిన మాట యదార్ధమే అని అంగీకరించారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతుంటే ముందు ముందు దారుణ పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని.. అధికారులు బుగ్గన దృష్టికి తీసుకురాగా.. ఆయన చేతులు ఎత్తేశారట.
నేను ఏమీ చేయలేను.. నిమిత్త మాత్రుడని.. ఆర్దిక మంత్రిగా ఇంకెంత కాలం ఉంటానో నాకు తెలియదు.. అసలు మంత్రి పదవే ఒద్దనుకుంటున్నాను. రేపో మాపో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలిసి చెప్పాలనుకుంటున్నాను అని ఏకాంతంగా తనను కలిసిన అధికారులతో బుగ్గన చెప్పినట్లు బయటకు పొక్కింది.