Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

దేశం మాజీ మంత్రులకు మునిసిపోల్స్ అగ్ని పరీక్ష..!

ఐదేళ్లు మంత్రి హోదాలో అధికారం చెలాయించిన తాజా మాజీ మంత్రులకు మునిసిపల్‍ ఎన్నికలు అగ్ని పరీక్షగా ఎదురయ్యాయి. మునిసిపల్‍ ఎన్నికలలో అభ్యర్ధులను ఎలా గెలిపించుకోవాలి అనే విషయంపై మాజీ మంత్రులు నానా తంటాలు పడుతున్నారట. ఏదో విధంగా మునిసిపల్‍ ఎన్నికలలో విజయం సాదించి మాజీ మంత్రులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని అధికార నేతలు చేస్తున్న హడావిడిని మాజీ మంత్రులు తట్టుకోలేకపోతున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీలో మెజార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేస్తున్న హడావిడి ఎంత వరకు కలిసిరానుందో..? నిత్యం ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేసి సంచలనాలు సృష్టిస్తున్న అయ్యన్నపాత్రుడుని రాజకీయంగా దెబ్బకొట్టాలంటే.. నర్సీపట్నం మునిసిపాలిటీలో మెజార్టీ డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్ధులను తప్పనిసరిగా గెలిపించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకు, ఇతర పార్టీ ముఖ్యులకు సిఎం జగన్‍ రెడ్డి హుకుం జారీ చేసినట్లు తెలిసింది.

- Advertisement -

అదే విధంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మెజార్టీ అభ్యర్ధులను గెలిపించుకునే సత్తా మాజీ మంత్రి ప్రత్తిపాటికి ఉన్నప్పటికీ.. ఆయన మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బందరు మునిసిపాలిటీలో మెజార్టీ డివిజన్లను కైవసం చేసుకునేందుకు మంత్రి పేర్ని నాని పట్టుదలతో ఉండగా.. ఏదో విధంగా మునిసిపాలిటీలో మెజార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మునిసిపాలిటీలో మెజార్టీ సాధించాలని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిసింది. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మునిసిపాలిటీలో మెజార్టీ డివిజన్లలో అభ్యర్ధులను గెలిపించుకోవాలని రాజమండ్రి లోక్‍సభ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్‍ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలించనున్నాయో.

పైన పేర్కొన్న విధంగా తెలుగుదేశం మాజీ మంత్రులకు మునిసిపల్‍ ఎన్నికలు అగ్ని పరీక్షే కాకుండా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తు రాజకీయం అంధకారమే అని పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.