వలస కూలీలు మన ఆర్థిక వ్యవస్థకు పునాదివంటివారని, వారిపైనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మన నగరాలను వలస కూలీలే నిర్మించారన్నారు. అలాంటివారి మెరుగైన జీవితం కోసం మనం తగినంతగా ఏదీ చేయడం లేదన్నారు. ఈ అదికార పర్యవేక్షణ లేని (ఇన్ఫార్మల్) రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోకూడదని చెప్పారు.
గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు, నోబెల్ పురస్కారం గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌తో వీడియో కాల్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. వలస కూలీలు ఉండే అదికార పర్యవేక్షణ లేని రంగాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు.
- Advertisement -
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘వలస కూలీలు మన నగరాలను నిర్మించారు. వారే పునాది, ఆ పునాదిపైనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. వారికి మెరుగైన జీవితం ఇవ్వడానికి మనం తగినంతగా చేయడం లేదు. అదికార పర్యవేక్షణ లేని రంగాన్ని విస్మరించరాదు’’ అని చెప్పారు.
ప్రొఫెసర్ యూనస్ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను తప్పుడు విధానంలో నడుపుతున్నారన్నారు. సమాజంలోని బలహీనతలను కరోనా వైరస్ వికృతంగా చూపించిందన్నారు. ఇవి సమాజంలో దాక్కుని ఉన్నాయని చెప్పారు. వీటికి మనం అలవాటుపడిపోయినట్లు తెలిపారు. నగరాల్లో ఉండే వలస కూలీలు కోవిడ్ సంక్షోభం వల్ల తిరిగి తమ స్వస్థలాలకు బలవంతంగా వెళ్ళిపోవలసి వచ్చిందని చెప్పారు. వీరిని మనం గుర్తించవలసి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వీరిని పరిగణనలోకి తీసుకోదన్నారు. వీరిని ఇన్ఫార్మల్ సెక్టర్ అని మాట్లాడతారని అన్నారు. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే వాళ్లతో మనకేమీ పని లేదని అర్థమని చెప్పారు. వారు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాదన్నారు. ఆర్థిక వ్యవస్థ ఫార్మల్ సెక్టర్‌తో ప్రారంభమవుతుందన్నారు.
భారత దేశం, బంగ్లాదేశ్ పాశ్చాత్య విధానాలను అనుసరించి ఆర్థిక వ్యవస్థలను నడుపుతున్నాయని, ఇన్ఫార్మల్ సెక్టర్‌ను విస్మరించాయని అన్నారు. ప్రజల శక్తి, సామర్థ్యాలను మనం గుర్తించడం లేదన్నారు.