భారత, చైనా మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వైఖరిని తాము శాంతియుతంగానే పరిష్కరించడానికి శతధా ప్రయత్నిస్తున్నామని భారత వైమానిక దళ చీఫ్ ఆర్.కె.ఎస్. బధూరియా స్పష్టం చేశారు. అయితే కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పే సత్తా తమకుందని స్పష్టం చేశారు.
- Advertisement -
హైదరాబాద్ నగరంలోని దుండిగల్‌లో ఉన్న ఏయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. భారత రక్షణ దళాలు మాత్రం సర్వ సన్నద్ధంగానే ఉన్నాయని, ఎలాంటి సవాల్‌పైనా స్పందించడానికి సిద్ధంగానే ఉన్నాయన్నారు. గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన 20 మంది భారత జవాన్లకు ఈ సందర్భంగా నివాళులర్పించారు.
భారత వాయుసేన చీఫ్ బధూరియా మాట్లాడుతూ…. ‘‘గాల్వన్ లోయలో ఎల్ఐసిని కాపాడడానికి కల్నల్ సంతోశ్ బాబుతో పాటు వారి టీం అత్యున్నత త్యాగం చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో వారి సంకల్పాన్ని ప్రదర్శించారు. అత్యంత క్లిష్టమైన, సవాళ్ల మధ్య వారు తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని ఎలాగైనా కాపాడాలన్న దృఢ సంకల్పంతో నే పోరాడారు. దేనికైనా సరే మనం సిద్ధంగానే ఉండాలి. సరిహద్దుల్లో బలగాలు ఏం జరిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉంటాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. సరిహద్దుల వద్ద అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. భారత భద్రతా దళాల సత్తాపై ఏ విధమైన శంక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సవాళ్లెదురైనా దేశ సేవే మన ప్రథమ కర్తవ్యం’’ అని బధూరియా స్పష్టం చేశారు.